Bheemavaram Bullodu Movie Review in Telugu

'భీమవరం బుల్లోడు' మూవీ రివ్యూ, రేటింగ్

టైటిల్ : భీమవరం బుల్లోడు (2014)
ప్రముఖ తారాగణం : సునీల్, ఈస్టర్
దర్శకుడు : ఉదయ్ శంకర్
నిర్మాత : సురేష్ బాబు
సంగీత దర్శకుడు : అనూప్ రుబెన్స్
సెన్సార్ రేటింగ్ : 'U/A'

భీమవరం బుల్లోడు మూవీ రేటింగ్ - 2.5/5

పోయిన సంవత్సరం 'మిస్టర్ పెళ్ళికొడుకు' సినిమాతో ఫ్లాప్ అందుకున్న సునీల్ ఆ తర్వాత వచ్చిన మల్టీ-స్టారర్ చిత్రం 'తడాఖా' తో హిట్ అందుకున్నాడు. అయితే ఈ సారి సోలోగా హిట్ కొట్టడానికి 'భీమవరం బుల్లోడు' మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ మూవీలో ఈస్టర్ సునీల్ సరసన హీరోయిన్ గా నటించింది. దాదాపు 4 సంవత్సరాల తర్వాత ఉదయ్ శంకర్ మెగా ఫోన్ పట్టి చేసిన చిత్రం ఇది. సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రం అనేక సార్లు వాయిదా పడినప్పటికీ, చిత్రబృందం సరైన ప్రమోషన్స్ చేస్తూ వచ్చింది. ఇక ఈ సినిమాతో సునీల్ నుంచి మంచి కామెడీ చిత్రం వస్తుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. మరి ఈ బుల్లోడు ఏ మేరకు రాణించాడో ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

కథ :-

రాంబాబు (సునీల్) భీమవరంలో జీవిస్తూ ఉంటాడు. ఇక ఒకరోజు అతనికో ప్రమాదకరమైన జబ్బు ఉందని దానితో అతను ఎక్కువ రోజులు బతకడని తెలుస్తుంది. దానితో ఈ చివరి రోజుల్లో ఆనందంగా గడపాలని హైదరాబాద్ వస్తాడు. ఇక హైదరాబాద్ లో రౌడీలతో గొడవపడి నందు(ఈస్టర్)ని రక్షిస్తాడు. ఇక చిన్నగా నందుతో ప్రేమలో పడతాడు. నందు  పెళ్లి ఖాయం అయిన తర్వాత, తన ప్రేమ వ్యవహారం గురుంచి రాంబాబుని అడుగుతుంది. అప్పుడు రాంబాబు తన జబ్బు గురుంచి వివరంగా చెప్తాడు.

అయితే ఆ తర్వాత తనకి ఎటువంటి జబ్బు లేదని రాంబాబుకి తెలుస్తుంది. ఇక అప్పటి నుంచి రాంబాబుకి అసలు సమస్యలు మొదలవుతాయి. చివరికి రాంబాబు నందుని ఎలా దక్కించుకున్నాడు.. రౌడీల సమస్య నుండి ఎలా బయటపడ్డాడు అనేది మిగిలిన కథ.

నటీనటుల ప్రతిభ :- 

రాంబాబు పాత్రకి సునీల్ పూర్తి న్యాయం చేసాడు, సినిమా మొత్తాన్ని సునీల్ తన భుజాలపై వేసుకొని నడిపించాడు. సునీల్ నుంచి ఆశించిన కామెడీ ఈ సినిమాలో ఉంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో సునీల్ కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటుంది. డాన్సుల్లో సునీల్ అద్భుతంగా చేయనప్పటికీ, సింపుల్ గా మంచి లుక్ వచ్చేలా చేసాడు. ఇక ఈస్టర్ విషయానికి వస్తే ఆమె సినిమాకి ఓ మైనస్ అయ్యింది. బాగా హెవీగా కనిపించింది. మేకప్ కొన్ని సీన్స్ లో బాగా ఓవర్ అయ్యింది. నటనలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

సుప్రీత్ విలన్ గా మరోసారి మెప్పించాడు. షియాజీ షిండే, పోసాని డైలాగ్స్ బాగున్నాయి. జయప్రకాశ్, శ్రీనివాస రెడ్డి బాగానే చేసారు. మిగిలిన వారు తమ పాత్రలకి న్యాయం చేసారు.

సాంకేతికవర్గం పనితీరు :-

మంచి కామెడీ దర్శకుడిగా పేరున్న ఉదయ్ శంకర్ 'బలాదూర్' సినిమా తర్వాత నేరుగా తెలుగులో చేసిన సినిమా ఈ 'భీమవరం బుల్లోడు'. సింపుల్ కథని ఎంచుకొని, దానికి మంచి కామెడీ, మాస్ మసాలా సీన్స్ తగిలించి ఈ సినిమా తెరకెక్కించాడు ఉదయ్ శంకర్. అయితే స్క్రీన్-ప్లే అంత ఆసక్తికరంగా సాగలేదు. ఇక సెకండ్ హాఫ్ బాగా సాగదీసాడు. క్లైమాక్స్ బాగా పెద్దదైపోయింది. మొత్తంగా ఉదయ్ శంకర్ నుంచి ఆశిస్తున్న సినిమాని అందించలేకపోయాడు.

అనూప్ రుబెన్స్ అందించిన సంగీతం బాగుంది. ఆడియో సాంగ్స్ కి ఇప్పటికే మంచి స్పందన లభించగా, నేఫద్య సంగీతం కూడా ఓకే అనిపించాడు. ఇక టైటిల్ సాంగ్ ఇప్పటికే అందరి నోట్లో నానుతుంది. సంతోష్ రాయి సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. పాటల చిత్రీకరణ బాగుంది. ఎడిటింగ్ సినిమాకి తగ్గ సస్పెన్స్ అందించలేదు. నిర్మాణాత్మక విలువలు బాగానే ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :- 

సునీల్ నటన, కామెడీ 
కొన్ని కామెడీ సీన్స్ 
సంగీతం 

మైనస్ పాయింట్స్ :- 

ఈస్టర్ 
దర్శకత్వం 
ఎడిటింగ్ 
క్లైమాక్స్ 

చివరి మాట :- రొటీన్ గా సాగే కామెడీ చిత్రమే తప్ప పెద్ద ప్రత్యేకత ఏమీ లేదు ఈ 'భీమవరం బుల్లోడు' . సునీల్ కామెడీ చూడాలనుకుంటే ఒకసారి వెళ్ళొచ్చు.

Comments